జగన్ దుర్మార్గుడు...నయవంచకుడు.
అమరావతిపై తన మనసులో ఉన్న విషాన్ని వెళ్లగక్కాడు.
వైసీపీని ఏపీ నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
విజయవాడ రూరల్ :మాజీసీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నయవంచకుడు అని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తన మనసులో ఉన్న విషాన్ని వెళ్లగక్కాడని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విషపు వ్యాఖ్యలు, ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకిస్తూ అప్పట్లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు.
పేనుకు పెత్తనం ఇచ్చినట్లు ఒక్క అవకాశం అంటూ అడిగిన జగన్మోహన్రెడ్డికి అధికారం అప్పగించిన కారణంగా అసెంబ్లీలో అప్పట్లో బిల్లు పెట్టారని అన్నారు. అప్పట్లోనే ఆ బిల్లును తను వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు.
జగన్మోహన్ రెడ్డికి మన ప్రాంతం పట్ల పూర్తిగా ద్వేషం ఉందన్నారు. ఏపీకి తలమానికమైన ప్రాజెక్టులు పోలవరం, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడంతో విశాఖలో డేటా సెంటర్, రాయలసీమలో కంపెనీలు వస్తున్నాయని ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఆంధ్రుడు సంతోషపడుతున్నారన్నారు.
సీఎంగా పనిచేసి, ఒక రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేకుండా మన ప్రాంతంపై విమర్శలు చేస్తున్నాడని అన్నారు.
ఇక్కడి వైసీపీ నాయకులు అతనితో ఏకీభవించి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తారా..? ఈ ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోతారా? అని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఇక్కడి మాజీమంత్రి కూడా అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు. దీనితో మా వైఖరి మార్చుకుంటున్నామని, అమరావతికి తాము అనుకూలం అని ప్రకటించారన్నారు.
కానీ నిన్న మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తాము అమరావతికి పూర్తిగా వ్యతిరేకం అని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే గతంలో అమరావతికి ఏ గతి పట్టిందో మళ్ళీ అదే విధంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అయిందన్నారు.
కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులను దీనిపై ప్రజలు బహిరంగంగా ప్రశ్నించాలన్నారు. వైసీపీ నాయకులను బయట తిరగనివ్వకూడదన్నారు.
ఒకనాడు పోరాటాలకు ఆంధ్రులు సిద్ధంగా ఉండేవారు. పొట్టి శ్రీరాములు నాయకత్వంలో పోరాడి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని సాధించామన్నారు.
మళ్ళీ ఉమ్మడి ఏపీలో అక్కడ అభివృద్ధి చేసి, తెలంగాణ ఏర్పడి, భంగపడి మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ ను మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే, మనలో ఉన్న వ్యక్తులే మన కళ్ళు పొడిచి, ఈ రాష్టాన్ని బ్రష్టు పట్టిస్తూ ఉన్నారని అన్నారు.
ఇటువంటి వారందరికీ ఎదురు తిరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీ నాయకులు దీనిపై స్పష్టత నివ్వాలని, లేకుంటే వారిని ఇక్కడి నుంచి తరిమికొట్టాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు.



