Subscribe Us

header ads

సూపర్ సిక్స్ - సూపర్ హిట్


 

ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ది

రేపటి నుంచే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం

స్త్రీ శక్తి’ పేరుతో పథకాన్ని కూటమి నేతలతో కలిసి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

2.62 కోట్ల మంది రాష్ట్ర మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేలా పథకం

74 శాతం బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి అవకాశం

కొత్త పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,942 కోట్ల భారం

ఇప్పటికే పింఛన్లు, దీపం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు

రెట్టింపు సంక్షేమం... రెట్టింపు సంతోషం అంటున్న లబ్దిదారులు

అమరావతి, ఆగస్టు 14: సూపర్ సిక్స్ పథకాల అమలు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోంది. ఈ క్రమంలో మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు సిద్దమైంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం నుంచి విముక్తి కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15న ప్రారంభిస్తోంది. ఈ మేరకు శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పిఎన్బిఎస్ లో కూటమి నేతలతో కలిసి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా సూపర్ సిక్స్ పథకంలోని మరో ముఖ్యమైన పథకాన్ని అమల్లోకి తెచ్చినట్టు అవుతుంది. ఈ మేరకు రవాణ శాఖ, ఆర్టీసీ సిద్దమైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్లు ఇవ్వడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కూడా సిద్దం చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు మహిళలకు ప్రభుత్వం కల్పించింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలు వినియోగించుకోవచ్చు. ఆర్టీసీ పరిధిలో మొత్తంగా 11,449 బస్సులు ఉంటే.. అందులో 74 శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

*మహిళలకు తగ్గనున్న ప్రయాణ ఖర్చులు*

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం మహిళలు వివిధ బస్సుల్లో వారానికి నాలుగు సార్లు సరాసరి ప్రయాణిస్తారు. ఇక ఉద్యోగాలు చేసే మహిళలైతే రోజు వారీ ప్రయాణిస్తారు. దీని నిమిత్తం నెలకు ఒక్కో మహిళకు సుమారుగా రూ.1000 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుంది. ముందుగా కేవలం సిటీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే స్త్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా.. బస్సులో ప్రయాణించే ప్రతి పేద, మధ్య తరగతి, సామాన్య మహిళకు ప్రయాణ ఖర్చు తగ్గించాలి, దూర ప్రయాణాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం సుమారుగా రూ. 1942 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసికి చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం భరించడం కష్టమే అయినా.. మహిళలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్గించేలా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన హామీని నెరవేర్చినట్టు అయింది. ప్రయాణికులు రాష్ట్ర వాసులు అయ్యుండాలి. ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇలాంటివి కండక్టర్లకు చూపించి ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు. నాన్‌స్టాప్‌లు, సూపర్ లగ్జరీలు, ఏసీ బస్సులు, ఘాట్ రూట్లలో తిరిగే సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.

*సూపర్ సిక్స్ - సూపర్ హిట్ :*

కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్‌తో పాటు ప్రతీ వర్గానికి, ప్రతీ ప్రాంతానికి, ప్రతీ కుటుంబానికి, ప్రతీ పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకే కొత్త నిర్వచనం ఇస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే 5 సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వాటిని అమల్లోకి తెచ్చింది.

*ఎన్టీఆర్ భరోసా పింఛన్లు :*

‘పేదల సేవలో’ కార్యక్రమంలో 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటివద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఏడాదికి రూ.33,000 కోట్లు కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు పెట్టడం లేదు. ఒక్క పింఛన్ల పంపిణీకే ఇప్పటికి రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ‘తల్లికి వందనం’ పథకంతో రూ.10 వేల కోట్లతో ఒక్కో విద్యార్ధికి రూ.15,000 చొప్పున మొత్తం 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలున్నా... వారందరికీ పథకాన్ని వర్తింప చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పినట్లుగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశారు. ప్రతీ రైతుకు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశారు. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించారు. దీపం-2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి వంటింటి ఖర్చు తగ్గించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఏటా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికి 2 కోట్ల రాయితీ సిలిండర్లు దీపం పథకం కింద ఇచ్చారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఈ నెలాఖరుకు నియామకాలు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌’ను రద్దు చేసిన ప్రభుత్వం... మరోవైపు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు తిరిగి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు 204 అన్నా క్యాంటిన్లలో 5.16 కోట్ల మందికి రూ.5 లకే కడుపునింపారు.

*మొదటి నుంచి మహిళా సంక్షేమం*

ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పథకాలు, కార్యక్రమాలు అమలు చేసింది. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు మహిళావర్గం కోసం అమలు చేస్తున్నారు. 1983లో పార్టీ పెట్టిన తర్వాత మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. 1986లో మహిళలకు ఆస్తిహక్కు తెచ్చారు. మహిళల కోసం పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్ధల్లో ఎన్టీఆర్ హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ప్రతి కి.మీ.కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ.కు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కి.మీ.కు ఒక హైస్కూల్, ప్రతి మండలానికో జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్ కో ఇంజినీరింగ్ కాలేజి, ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజ్, వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చి మహిళలకు విద్యను దగ్గర చేశారు. మహిళలకు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు కల్పించారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు - రివాల్వింగ్ ఫండ్ అందజేత వంటి కార్యక్రమాలతో ఆర్థికంగా వారిని నిలబెట్టారు. 1997లో బాలిక శిశు సంరక్షణ పథకం కింద పుట్టిన ఆడబిడ్డకు బ్యాంకులో రూ.5 వేలు డిపాజిట్ చేసి 12 ఏళ్లు వచ్చాక వడ్డీ సహా చెల్లింపు అనే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబునాయుడు నాడు అమలు చేశారు. 8, 9, 10వ తరగతి విద్యార్థినిలకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉచిత సైకిళ్ల పథకం అమలు చేశారు. 2014 తరువాత కూడా ఆ పథకాన్ని అమలు చేశారు. తద్వారా గ్రామాల్లో ఆడబిడ్డలు స్కూళ్లకు వెళ్లడానికి సౌకర్యం కల్పించారు. 2014 తరువాత మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు మంజూరు చేశారు. అన్న అమృత హస్తం కింద గర్భిణిలకు, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కూడా నాడు ప్రారంభించిందే. నవజాత శిశువులకు బేబీ కిట్లు, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్, బాలామృతం వంటి పథకాలతో తల్లులకు అండగా నిలిచారు. పెళ్లి కానుక వంటి పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సహాయం చేశారు.