జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనను అందిస్తున్నది-మంత్రి పార్థసారధి
ఏలూరు, ఆగష్టు, 15 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన మహానీయులను స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవలసిన బాధ్యతపై మనందరిపై ఉందన్నారు. వారి కలలను సాకారం చేసేందుకు మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనను అందిస్తున్నదన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుండి తిరిగి పోలవరం పనులు పునర్జ్జెవం పొందాయన్నారు. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ధృడ సంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నామన్నారు. జీరో పావర్టీ కోసం అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం పీ4 కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో 75 వేల 871 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి, ఇప్పటివరకు 68 వేల 268 కుటుంబాలను 7వేల 675 మార్గదర్సకులతో దత్తత తీసుకున్నామన్నారు. జిల్లాలో అన్నదాతా సుఖీభవ.. పీ. ఎం. కిసాన్ పధకం కింద 1, 60, 968 రైతు కుటుంబాలకు రూ. 107. 58 కోట్లు పెట్టుబడి సాయంగా రైతులకు విడుదల చేశామన్నారు. జిల్లాలో గత ఆర్ధిక సంవత్సరంలో 65 వేల 147 మంది కౌలు రైతులకు సిసిఆర్సీ కార్డులు అందించామన్నారు. అందులో ఇంతవరకు 23 వేల 274 మంది కౌలు రైతులకు రూ. 143 కోట్లు రుణాలను బ్యాంకుల ద్వారా అందించామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 49 వేల 168 మంది కౌలు రైతులకు సిసిఆర్సీ కార్డులు అందించామన్నారు.
2024 ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకుగాను 5 వేల 891 మంది రైతులకు రూ. 7. 02 కోట్లు పంట నష్ట పరిహారాన్ని అందించామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉద్యాన శాఖ ద్వారా వివిధ పదకాల కింద 15 వేల 583 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలను అభివృద్ధి చేశామన్నారు. బిందు, తుంపర సేద్యం ద్వారా ఇప్పటివరకు 6223 మంది రైతులకు రూ. 29. 80 కోట్లు అందించామన్నారు. జలవనరుల శాఖ ద్వారా ఓ అండ్ ఎం యాక్షన్ ప్లాన్ లో రూ. 9. 11 కోట్లతో కాలువలు, డ్రైన్లలో తూడు తొలగించామన్నారు.
జపాన్ బ్యాంకు వారి ఆర్ధిక సహకారంతో తమ్మిలేరు ప్రాజెక్ట్ ఆధునికీకరణకు 16 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ పనులు 93 శాతం పూర్తి చేయడమే కాకుండా కృష్ణా డెల్టా ఆయకట్టును సంరక్షించేందుకు, పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా 442 టీఎంసీ ల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్ళించామన్నారు. జిల్లాలో 258 కోట్ల రూపాయలతో 158 రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి, ఇంతవరకు 129 పనులు పూర్తిచేశామన్నారు. కొత్తగా 69 కోట్ల రూపాయలతో 40 రహదారి మరమ్మత్తులు పనులు చేపడుతున్నామన్నారు.
ప్రధానమంత్రి ఆవాసయోజన. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకంలో నిరుపేదలకు లక్షా 02 వేల 237 గృహాలను రూ. 1840 కోట్ల రూపాయలతో నిర్మిస్త్తున్నామన్నారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బిసి., పివీటిజి లకు మంజూరైన యూనిట్ విలువ రూ. 1. 80 లక్షలకు అదనంగా బిసి., ఎస్సీ లకు 50 వేల రూపాయలు, ఎస్టీ లకు 75 వేల రూపాయలు, పివీటిజి లకు లక్ష రూపాయలు అదనంగా సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 4 వేల 766 మంది లబ్దిదారులకు రూ. 9. 68 కోట్లు అందజేశామన్నారు. లే అవుట్లలో స్థలాల మెరక , రహదారులు, విద్యుత్, కల్వర్టుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలను రూ. 44. 74 కోట్ల రూపాయలతో పూర్తిచేశామన్నారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ పధకం ద్వారా గృహ వినియోగదారులకు 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటుకోసం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 2604 వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. జిల్లాలో 5 మోడల్ సోలార్ గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి కుసుమ పధకంలో భాగంగా ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 115 ఎకరాలలో 750 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. .
జిల్లాలో 2982 ఆక్వా రైతులకు రూ. 52 కోట్లు విద్యుత్ రాయితీ అందించామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదల వైద్య అవసరాల కోసం 400 కోట్ల రూపాయలు అందించామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద జిల్లాలో 2, 61, 592 మందికి ప్రతీ నెల 114. 25 కోట్ల రూపాయలు పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ఆగష్టు నెలలో కొత్తగా 4వేల 358 పెన్షన్లు మంజూరు చేశామన్నారు. 2,253 డ్వాక్రా గ్రూపులకు 194 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజి రుణాలు అందించామన్నారు. స్త్రీ నిధి కింద 58 కోట్ల రూపాయలు, ఉన్నతి కింద 10 కోట్ల రూపాయలు అందించామన్నారు. జిల్లాలో ప్రభుత్వ సాంఘిక వసతి గృహాలను రూ. 5. 73 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. దీపం పధకం కింద మొదటి దశలో సుమారు 4 లక్షల మందికి, రెండవ దశలో 3. 83 లక్షల మంది మహిళలకు రూ. 62. 21 కోట్లతో ఉచిత గ్యాస్ సిలండర్లు పంపిణీ చేశామన్నారు.
గత రబీ సీజన్లో 20 వేల 530 మంది రైతులు నుండి రూ. 583 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాలకు సొమ్ము జమ చేశామన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎం ఈ పార్కులు ఏర్పాటుచేసే పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఇప్పటివరకు 38 వేల 909 ఫిర్యాదులు నమోదుకాగా, వాటిలో ఇంతవరకు 35, 997 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పాలనను మరింత చేరువ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి0, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పీఎస్.. కిషోర్, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ జిల్లా అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.



