ఏలూరు :
మహిళా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే కుటుంబమంతా ఆరోగ్యవంతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. 'స్వస్త్ నారీ సశక్త్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలు వద్ద గల వెయిటింగ్ హాలులో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య శిబిరంలో బిపి, డయాబిటిక్ పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వారిని వారి వివరాలను, చేయించుకున్న వైద్య పరీక్షలు, సిబ్బంది సేవలను అడిగి తెలుసుకున్నారు. వెట్రిసెల్వి మాట్లాడుతూ కుటుంబంలో మహిళ ఆరోగ్యవంతంగా ఉన్నపుడే కుటుంబాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తుందని, తద్వారా ఆ కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కేన్సర్ వంటి రోగాలు ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటాయన్నారు. వైద్య పరీక్షలలోనే దీర్ఘకాలిక రోగాలు బయటపడతాయని, అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాంతకం అవుతుందన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తిస్తే నియంత్రణకు అవకాశం ఉంటుందని, అందుకే ప్రతీ 6 నెలలు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు 'స్వస్త్ నారీ సశక్త్ అభియాన్' కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు మహిళలకు ఉచితంగా అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది, వారి కుటుంబంలోని మహిళా సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణకు గాను ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ఏపి ఎన్జీఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోదగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, ఎన్జీఓస్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కే పుష్పగుచ్ఛాన్ని అందించి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని, వైద్య పరీక్షల వాహనాలను, ప్రచార రధాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డా. పి .జె. అమృతం, డిసిహెచ్ ఎస్ డా. పాల్ సతీష్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



