సహజ వన్యప్రాణి లక్షణాలకనుగుణంగా ప్రవర్తించిన పులి
నాలుగు గంటలు పాకలో ఉన్నా పశువులకు హాని చేయలేదు
జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు
అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అప్రమత్తత ప్రశంసనీయం : కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమండ్రి :తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పులి గుడిసె ఇంట్లోకి ప్రవేశించి, అదే పాకలో సుమారు నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పులి ప్రవర్తన పూర్తిగా దాని సహజ వన్యప్రాణి లక్షణాలకు అనుగుణంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. విశ్రాంతి కోసం పాకలో ఉన్న పులి, అక్కడ ఉన్న పశువులపై ఎలాంటి దాడి చేయకుండా ప్రశాంతంగా వ్యవహరించడం వన్యప్రాణుల సహజ స్వభావాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ ఘటన వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ సేకరించిందని తెలిపారు. ఘటన అనంతరం గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా అటవీ శాఖ, పోలీసు శాఖల సూచనలను పాటించారని, వారి సహకారంతో పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. గ్రామంలో నిరంతర నిఘా కొనసాగించామని తెలిపారు.
పులిని అటవీ శాఖ అధికారులు విజయవంతంగా బంధించిన అనంతరం, ఎలాంటి ప్రమాదం లేకుండా పరిస్థితిని సమర్థంగా నిర్వహించినట్టు జిల్లా అటవీ అధికారి వివరించారు.
ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, వన్యప్రాణుల విషయంలో అటవీ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, అడవిలో నివసించే వన్యప్రాణులు వాటి సహజ లక్షణాల ప్రకారమే ప్రవర్తిస్తాయని, ఈ ఘటనలో పులి ఎలాంటి హానికర ప్రవర్తన చూపకపోవడం దానికి స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా, అటవీ శాఖ, పోలీసు శాఖలు ఇచ్చే సూచనలను పాటిస్తూ సహకరించినందుకు గ్రామస్తులను అభినందించారు. అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పులిని సురక్షితంగా బంధించడంలో చూపిన అప్రమత్తత ప్రశంసనీయం అని పేర్కొన్నారు. వన్యప్రాణుల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, ఇటువంటి సందర్భాల్లో సమన్వయంతో వ్యవహరిస్తే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని కలెక్టర్ తెలిపారు.
గమనిక: పులి నాలుగు గంటలు గడిపిన పాక, అందులో సురక్షితంగా ఉన్న రెండు గేదెల వీడియో అటవీ శాఖ అధికారులు విడుదల చేయడం జరిగింది.



