గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో భారీ చోరీ.. 10 కిలోల వెండి అపహరణ
కృష్ణా జిల్లా గుడివాడలో సంచలన చోరీ జరిగింది. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ నివాసంలో దొంగలు చొరబడి భారీగా వెండిని అపహరించారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.
వివరాల్లోకి వెళ్తే, ఈశ్వర్‌కుమార్ సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లగా, బుధవారం తిరిగి గుడివాడకు వచ్చారు. ఇంటికి చేరుకున్న ఆమె తాళాలు పగులగొట్టబడి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని వస్తువులు అన్నీ గందరగోళంగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు.
పరిశీలించగా దాదాపు 10 కిలోల వెండి, అలాగే పూజా సామాగ్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే మధురిమ గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్లూస్ టీంను కూడా పిలిపించి, ఘటన స్థలంలో పరిశీలనలు నిర్వహించారు. కొంత కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మాజీ మంత్రి ఈశ్వర్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇల్లు ఖాళీగా ఉండేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం రాత్రి సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.


