అక్షయపాత్ర ఫౌండేషన్ 500 కోట్ల భోజనాల ఘనత
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆకలి సమస్యను తగ్గించడంలో విశేష సేవలందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ మరో విశిష్ట మైలురాయిని అందుకుంది. సంస్థ తన 25 ఏళ్ల సేవా ప్రయాణంలో భాగంగా మొత్తం 500 కోట్ల భోజనాలను అందించి అరుదైన ఘనతను సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై సంస్థ సేవలను ప్రశంసించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొని అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవలు దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో స్నేహపూర్వకంగా ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం)లో భాగస్వామిగా అక్షయపాత్ర ఫౌండేషన్ కోట్లాది మంది విద్యార్థులకు పోషకాహార భోజనం అందిస్తోంది. దీని ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు, వారి ఆరోగ్యం మరియు చదువులోనూ మెరుగుదల కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మధు పండిత్ దాస, వైస్ చైర్మన్ చంచలపతి దాస, ఏపీ ప్రాంతీయ అధ్యక్షుడు వంశీధర దాస తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే 2024లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 400 కోట్ల భోజనాల మైలురాయిని జరుపుకున్న సంస్థ, ఇప్పుడు 500 కోట్ల భోజనాల ఘనతను సాధించడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది పిల్లలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.


