కృష్ణాజిల్లా :
గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రకటించిన ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలను, గన్నవరం నియోజకవర్గంలో తాను ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో సోమవారం ఉదయం లైట్ హోమ్ వైద్యశాలను యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఈ వైద్యశాలలో పేదలకు కేవలం పది రూపాయలు ఫీజుతో వైద్యం అందించడంతోపాటు, మందులు, రక్త పరీక్షల్లో 50% రాయితీ ఇస్తారని తెలిపారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మలవల్లి పారిశ్రామిక వాడను ఇప్పటికే పునరుద్ధరించామని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని త్వరలో ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. పోలవరం ఏలూరు కాలువ అనుసంధానికి గతంలో టిడిపి ప్రభుత్వం రూ. 15.60 కోట్లు కేటాయించగా తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో నాయకులు కాంట్రాక్టర్లను పెద్ద మొత్తంలో కమిషన్లు కోరడంతో కాంట్రాక్టర్ పారిపోయాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ అనుసంధానానికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు యార్లగడ్డ వివరించారు. ఈ రెండింటి అనుసంధానం వల్ల దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.
గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న 12.50 ఎకరాల ప్రభుత్వ భూమిని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం సిఆర్డిఏ కి బదిలీ చేశామని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు. త్రిబుల్ ఐటీ గచ్చిబౌలి శాఖను గన్నవరంలో ఏర్పాటు చేయించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయన్నారు. తాత్కాలికంగా మేధా టవర్స్ లో తరగతులు నిర్వహించేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక అనుమతులు ఇచ్చారని యార్లగడ్డ వివరించారు. పెద్ద ఆవుటపల్లిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో సుమారు 85శాతం వరకు రహదారులపై గుంతలు మరమ్మత్తులు చేశామని మరో 15శాతం గుంతలు పూడ్చాల్సి ఉందన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో తాజాగా 240 మంది పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు ఏర్పాటు కోసం భూములు రిజిస్ట్రేషన్ చేశామని, మరో వందమందికి చేయాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 8వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, రాబోయే రెండు నెలలలో అశోక్ లేలాండ్ కంపెనీలో 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు యార్లగడ్డ భరోసా ఇచ్చారు.
గన్నవరం మండలం, విజయవాడ రూరల్ మండలాన్ని విజయవాడ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గం లోని బాపులపాడు, ఉంగుటూరు మండలాలను సైతం విజయవాడ గ్రేటర్ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, ఇళ్ళు కోల్పోయిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసినట్లు యార్లగడ్డ తెలిపారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు యార్లగడ్డ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో లైట్ హోమ్ వ్యవస్థాపకులు ఎలీషా, నాయకులు కోటగిరి వరప్రసాద్, బోయపాటి మురళీకృష్ణ, అన్నే లక్ష్మణరావు, బసవపూర్ణయ్య, వెంకటరత్నం, యనమదల సతీష్, మేడేపల్లి రమ తదితరులు పాల్గొన్నారు.



