ఏలూరు జిల్లా వన్యప్రాణి విభాగం అటవీ అధికారిణి (డీఎఫ్వో) బత్తిన విజయ ఆకస్మికంగా బదిలీ కావడం ఇప్పుడు అటవీ శాఖలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నుంచి అందిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఆమెను తక్షణమే విధు నుంచి రిలీవ్ కావాలని, రాష్ట్ర అటవీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆమె స్థానంలో జిల్లా టెరిటోరియల్ డీఎఫ్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న పొతంశెట్టి సందీప్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, పదోన్నతి పొంది విధుల్లో చేరిన కొద్ది నెలలకే ఆమె బదిలీ కావడం వెనుక కొల్లేరు అభయారణ్య పరిరక్షణ చర్యలే ప్రధాన కారణమని తెలుస్తోంది.
బత్తిన విజయకు కైకలూరు ప్రాంతంతో పాత అనుబంధమే ఉంది. 2021లో ఆమె ఇక్కడ రేంజర్ స్థాయి అధికారిణిగా పనిచేశారు. ఆ తర్వాత మాచర్లకు బదిలీపై వెళ్లిన ఆమె, తిరిగి 2024 సెప్టెంబరులో ఏలూరు జిల్లా వన్యప్రాణి విభాగం డీఎఫ్వోగా పదోన్నతిపై బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కొల్లేరు సరస్సు పరిరక్షణ విషయంలో ఆమె కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు సాధికారిత కమిటీ (సీఈసీ) ఇటీవల కొల్లేరు ప్రాంతంలో పర్యటించినప్పుడు, ఆ బృందానికి ఆమె నేతృత్వం వహించారు. అభయారణ్యం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్న అక్రమ చేపల చెరువుల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
సీఈసీ ఆదేశాల మేరకు కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా వెలిసిన చెరువులను ధ్వంసం చేసే ప్రక్రియను ఆమె వేగవంతం చేశారు. రాజమండ్రి సర్కిల్ పీసీసీఎఫ్ బీఎన్ఎన్.మూర్తితో కలిసి క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో చటాకాయి, నత్తగుళ్లపాడు వంటి గ్రామాల్లో అక్రమ చెరువుల తొలగింపునకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అభయారణ్య నిబంధనల పేరుతో తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ స్థానికులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ వివాదం కాస్తా ముదిరి, కొల్లేరు ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులు అటవీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అటవీ శాఖ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్ల స్థానిక రాజకీయ సమీకరణలు దెబ్బతింటాయని భావించిన కొందరు ప్రజాప్రతినిధులు, డీఎఫ్వో విజయపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిబంధనల అమలులో ఆమె చూపిన దూకుడు తమకు ఇబ్బందిగా మారిందని వారు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను హఠాత్తుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన అధికారిణిని ఇలా బదిలీ చేయడంపై అటవీ శాఖలోని తోటి అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, అక్రమ చెరువుల యజమానులు ఈ బదిలీతో ఊపిరి పీల్చుకుంటుండగా, పర్యావరణ ప్రేమికులు మాత్రం కొల్లేరు రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.


