లైన్‌మ్యాన్ దివస్ సందర్భంగా విద్యుత్ శాఖలో ఉత్తమ సేవా పురస్కారం పొందిన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (రి.నెం.1104) జంగారెడ్డిగూడెం డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం జీలుగుమిల్లి సబ్ డివిజన్ కార్యాలయం వద్ద సన్మానించారు.
కుక్కునూరు, వేలేరుపాడు సెక్షన్లలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం కృషి చేసిన లైన్‌మన్ తగరం వెంకటరత్నం, జూనియర్ లైన్‌మన్లు కె. సంకురు, కె. అనురామ్, కె. ముఖేష్, కె. రామచంద్రరావులను డివిజన్ అధ్యక్షుడు మడకం రాంబాబు, కార్యదర్శి సిహెచ్ రాజు, సహాయ కార్యదర్శి వై.వి. భాస్కర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు వి. జగన్ మోహన్ రావు సన్మానించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో మొబైల్ అప్లికేషన్ ద్వారా లైన్ క్లియర్ తీసుకోవడం వల్ల విధుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు.
కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


