అమెరికాలో భారీ వీసా మోసం – భారత సంతతి సవాని సోదరులు దోషులు

  అమెరికాలో భారీ వీసా మోసం – భారత సంతతి సవాని సోదరులు దోషులు

అమెరికాలో దశాబ్దకాలంగా సాగుతున్న భారీ వీసా మోసం వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన ఇద్దరు సోదరులు Bhaskar Savani మరియు Arun Savani అమెరికా కోర్టులో దోషులుగా తేలారు. వీసా మోసాలు, వైద్య బీమా అక్రమాలు, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి పలు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో నేరాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భాస్కర్ సవానికి గరిష్టంగా 420 సంవత్సరాల జైలు శిక్ష, అరుణ్ సవానికి 415 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

సమాచారం ప్రకారం, వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన భాస్కర్ సవాని తన సోదరుడు అరుణ్ సవానితో కలిసి “సవాని గ్రూప్” పేరుతో ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెట్‌వర్క్ ద్వారా అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారత్ సహా ఇతర దేశాల నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా H-1B visa కోసం తప్పుడు దరఖాస్తులు సమర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం చేశారు.

అమెరికాకు వచ్చిన తర్వాత కార్మికులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేవారు. వారి వేతనాల్లో ఒక భాగాన్ని తిరిగి సంస్థకు చెల్లించాలని బలవంతం చేసేవారు. ఇమ్మిగ్రేషన్ హోదా కోల్పోతామనే భయంతో చాలా మంది కార్మికులు వీరి వద్ద బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కాకుండా ఆరోగ్య బీమా మోసాలు మరియు పన్ను ఎగవేతల ద్వారా కోట్ల డాలర్ల అక్రమ లాభాలు పొందినట్లు విచారణలో బయటపడింది.

దీర్ఘకాల విచారణ తర్వాత అమెరికా న్యాయస్థానం ఈ ఇద్దరినీ దోషులుగా తేల్చింది. ప్రస్తుతం శిక్ష ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటన అమెరికాలో వీసా మోసాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.