ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి ట్యాంకులు పరిశుభ్రం, వైద్య పరీక్షలు.
త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు.
పాఠశాలలు, వసతిగృహాలలో ఫీవర్ సర్వే లు, వైద్య పరీక్షలు.
అధికారులతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్.
ఏలూరు :
ఏలూరుజిల్లాలో ఎక్కడా అంటువ్యాధులు వ్యాపించకుండా అన్ని ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాలలో గురువారం నాటికి పారిశుధ్య కార్యక్రమాలు, త్రాగునీటి నీటి ట్యాంకులు శుబ్రపరిచే పనులను పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. . స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం పారిశుద్ధ్యం, త్రాగునీటి వనరుల పరిశుభ్రత, విద్యార్థులకు ఫీవర్ సర్వే, వైద్య పరీక్షలు, జీఎస్టీ అవగాహన, సదరం క్యాంపుల నిర్వహణ, తదితర అంశాలపై కలెక్టర్ ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబల కుండా జిల్లావ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి గురువారం నాటికి పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు ,వెనుకబడిన తరగతులకు చెందిన ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, తదితర ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ఫీవర్ సర్వే, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎవరైనా అతిసారం, కామెర్లు వంటి వాటితో బాధపడుతుంటే వెంటనే చికిత్సలు అందించాలన్నారు. కలుషిత త్రాగునీరు ద్వారా అతిసారం, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, కావున త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలనీ, క్లోరినేషన్ చేయించాలని, త్రాగునీటి పైప్ లైన్లకు ఎక్కడైనా డ్రైనేజి పైప్ లైన్లు కలిసి త్రాగునీరు కలుషితం అవుతున్నాయేమోనని పరిశీలించి, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఫీవర్ సర్వే, వైద్య శిబిరాలు ఏర్పాటు, సదరం శిబిరాలు ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు తనిఖీ చేయాలన్నారు.
జీఎస్టీ 2. O లో దీర్ఘకాలిక రోగులకు సంబందించిన ఔషదాలు, కొన్ని ఔషదాలపై పూర్తిగా జీఎస్టీ తొలగించిన విషయంపై అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సదరం క్యాంపుల సక్రమంగా నిర్వహించాలని, సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే విభిన్న ప్రతిభావంతులకు వీల్ ఛైర్లు, త్రాగునీరు, కుర్చీలు, షామియానా వంటి ఏర్పాటు చేయాలనీ, ఎక్కడా ఎటువంటి రద్దీ వంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి .జె. అమృతం, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ. భానుప్రతాప్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, ప్రభృతులు పాల్గొన్నారు.



