గన్నవరం,కృష్ణ జిల్లా:
ఈ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే అనుసరించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి ఇందులో మినహాయింపు ఉండదని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వేంపాడు గ్రామంలో వేగ్నేశ రామకృష్ణ రాజు విరాళంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ బెడ్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తో కలిసి శనివారం సాయంత్రం యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షనీయమని అంబేద్కర్ ఆశయాలను ఆయన రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించకపోవడం శోచనీయమన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేయటం వైసీపీ నాయకులకు తగదని హితవు పలికారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఆ విషయం తెలిసి కూడా అసెంబ్లీకి రాకుండా పారిపోవటం తగదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రహదారుల అభివృద్ధిలో రఘురామకృష్ణంరాజు అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. తన చిరకాల మిత్రుడు వేగ్నేశ రామకృష్ణరాజు సొంత నిధులతో గ్రామస్తులకు సురక్షిత త్రాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా అట్టడుగుకు చేరిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని యార్లగడ్డ తెలిపారు.



