కృష్ణా జిల్లా,గన్నవరం :
గన్నవరం నియోజకవర్గంలో అవినీతి రహితంగా పాలన సాగిస్తున్నామని, అవినీతిని ఎట్టి పరిస్థితులను సహించేది లేదని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం గన్నవరంలో అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ అవినీతికి అక్రమాలకు ఆలవాలమైన గన్నవరంలో పరిస్థితిని పూర్తిగా మార్చి అవినీతి రహితంగా, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, లేఅవుట్లోని కామన్ సైట్లు సైతం ఆక్రమణల పాలయ్యాయని ఈ ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు అధికారులతో కమిటీలు నియమించినట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా ఆక్రమణలను విడగొట్టి ప్రభుత్వ భూములు కాపాడతామని హామీ ఇచ్చారు.గత 11 ఏళ్లుగా గన్నవరంలో చెరువుల మట్టిని అమ్ముకొని అక్రమార్కులు కోట్లు గడించారని 11 ఏళ్ల తర్వాత మట్టిని రైతులకు, ఇళ్ళు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు.
నియోజకవర్గంలో 15 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎనిమిదేళ్లుగా గన్నవరంలోనే ఉంటున్నామని తనను ఆదరించి అక్కున చేర్చుకున్న గన్నవరం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనని ప్రోత్సహిస్తూ, నియోజకవర్గంలో ఎస్సీజెడ్ లకు రూ.29 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సందర్భంగా యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. తనకి ఏ బాధ్యతలు అప్పగించినా సొంత కంపెనీల భావించి కస్టపడి పనిచేస్తానని తాను చైర్మన్ గా పనిచేసిన 13 నెలల కాలంలో కేడీసీసీ టర్నోవర్ రూ.8వేల కోట్లకు పెంచటంతో పాటు లాభాలను రూ. 15 కోట్లకు చేర్చటాన్ని ఉదహరించారు. అధికారులు, ప్రజలు అందరి సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ పేర్కొన్నారు. తాను గన్నవరం లోనే ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ఇక్కడే రాజకీయం చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.



