ఆగిరిపల్లిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక
ఆగిరిపల్లి: మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గత ఏడాది కాలంలో మండల వ్యాప్తంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులు, నిధుల వినియోగంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి పిడి సుబ్బారావు, ఏపీడీ శ్రీనివాస్, మరియు డి.వి.ఓ అనుపమ అధ్యక్షత వహించి పర్యవేక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనుల వివరాలను, సామాజిక తనిఖీలో వెల్లడైన అంశాలను వారు అధికారులకు వివరించారు. పథకం అమలులో పారదర్శకత పాటించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి ఎంపీడీవో భార్గవి, ఆగిరిపల్లి మండల ఎస్ఆర్పీలు తిరుపతిరావు, సిహెచ్ సత్యనారాయణ పాల్గొని తనిఖీ నివేదికలను చదివి వినిపించారు. అలాగే మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథక క్లస్టర్ ఇంచార్జిలు, సంబంధిత సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత, రికార్డుల నిర్వహణపై అధికారులు పలు సూచనలు చేశారు.


