ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది యార్లగడ్డ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లో మాట్లాడుతూ ఒంగోలు జాతి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని, మన రాష్ట్రంలో పుట్టిన ఈ జాతిని బ్రెజిల్ దేశం ‘నెలోర్’ పేరుతో అభివృద్ధి చేసి మాంసం ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా మారిందని గుర్తుచేశారు. అయితే మన రాష్ట్రంలో క్రాస్ బ్రీడింగ్, అక్రమ రవాణా, సరైన మౌలిక సదుపాయాల లేమి కారణంగా ఈ జాతి సంఖ్య రెండు నుంచి మూడు వేల వరకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో ఒంగోలు ఆవులు పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిపోయాయని విమర్శించారు. జాతి సంరక్షణ కోసం ప్రతి ఒంగోలు ఆవుకు ఆర్‌ఎఫ్‌ఐడీ డిజిటల్ ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయాలని, రాష్ట్ర సరిహద్దుల్లో కఠిన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అలాగే హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో పశు ప్రదర్శనలు నిర్వహించి ఉత్తమ పశువులకు రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒంగోలు ఆవుల సంరక్షణ బాధ్యత చేపట్టాలని, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యితో స్వామివారికి నైవేద్యం సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. రైతులకు ఎలైట్ దూడల కొనుగోలుపై 100 శాతం బీమా మరియు సబ్సిడీ కల్పిస్తేనే ఈ విశిష్ట జాతిని భవిష్యత్ తరాలకు అందించగలమని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.


