ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర యూనివర్సిటీ ఒక గర్వకారణం యార్లగడ్డ ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఒక గర్వకారణమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజక వర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 1923లో స్థాపించబడిన ఆంధ్ర బ్యాంక్ వేరే బ్యాంకులో విలీనమై తన పేరును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి ఆంధ్ర అనే పేరు మీద గర్వకారణంగా మిగిలింది కేవలం ఆంధ్ర యూనివర్సిటీ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ చారిత్రక విశ్వవిద్యాలయానికి భారీగా నిధులు కేటాయించి, మరింత బలోపేతం చేయాలని మంత్రి నారా లోకేష్ ను కోరారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలన లో ఆంధ్ర యూనివర్సిటీని వైకాపా పార్టీ కార్యాలయంగా మార్చడం వల్ల దాని ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. ఫలితంగా 2019లో 29వ స్థానంలో ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, 2023 నాటికి 76వ స్థానానికి పడిపోయిందని వివరించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలతో ప్రస్తుతం మళ్ళీ 41వ ర్యాంకుకు చేరుకుందని, త్వరలోనే దీనిని దేశంలోని టాప్-10 యూనివర్సిటీల జాబితాలోకి చేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఏయూలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, రాబోయే 45 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. యూనివర్సిటీల్లో సిబ్బంది నియామకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై స్పష్టత కోసం 30 రోజుల్లో మ్యాన్ పవర్ ఆడిట్ పూర్తి చేస్తామన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వేడుకలను రాష్ట్రస్థాయిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


