ఏపీకి ప్రత్యేక స్టాంప్ చట్టం అవసరం: ప్రభుత్వ విప్ యార్లగడ్డ
రాష్ట్ర శాసనసభలో రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ల శాఖపై జరిగిన చర్చలో గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కీలక సూచనలు చేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగానికి 3,867 కోట్ల 52 లక్షల 29 వేల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1899 నాటి బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమలవుతోందని, దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన అదనపు ఆదాయం ఆగిపోతోందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తమ సొంత స్టాంప్ చట్టాలను సవరించుకుని అదనపు ఆదాయాన్ని పొందుతున్నాయని, ఉదాహరణకు రాజస్థాన్‌లో గో సంరక్షణ నిధి కోసం 10% అదనపు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తున్నారని వివరించారు. ఏపీలో కూడా నిర్దిష్ట ఏపీ స్టాంప్ చట్టాన్ని తీసుకువస్తే, రాష్ట్ర ఖజానాకు ఏటా కనీసం 3,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని, దీనిపై సంబంధిత మంత్రి అధ్యయనం చేయాలని కోరారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రంలో ఎవరికీ రాని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని, ప్రజల ఆస్తులైన పాస్ బుక్కులపై తన ఫోటో వేసుకోవడం దారుణమని, దీనికి ఆయన సిగ్గుపడాలని విమర్శించారు. కృష్ణా బ్యారేజీ కట్టిన సర్ ఆర్థర్ కాటన్ గానీ, రైతులకు భూమి హక్కులు కల్పించిన థామస్ మన్రో గానీ తమ ఫోటోలు వేసుకోలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజముద్రతో పాస్ బుక్కులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియోజకవర్గంలోని మర్లపాలెం గ్రామాన్ని 22A నుంచి తొలగించినందుకు మంత్రికి ధన్యవాదాలు చెబుతూనే, ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే కృష్ణా యూనివర్సిటీ స్థాపన కోసం విజయవాడ రూరల్ మండలంలో 10 ఎకరాల భూమి కేటాయించామని, కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆ ఫైలును త్వరితగతిన క్లియర్ చేయాలని మంత్రిని అభ్యర్థించారు. గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో భూముల అన్యాక్రాంతంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో నరసింహారావు అనే ఎంఆర్ఓ రెండు మండలాల్లో ఉంటూ రికార్డులను ట్యాంపర్ చేశారని, లక్షల ఓట్లు ఉన్న ప్రాంతంలో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలంలో విలేజ్ హెల్త్ సెంటర్లు కట్టడానికి కూడా స్థలం లేనంతగా ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లలో కలిసిపోయాయని వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించినా కమిటీ పని ప్రారంభించలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతిపక్ష హోదా కోరుతున్న జగన్మోహన్ రెడ్డికి , చట్టసభల నియమ నిబంధనలు, సాంప్రదాయాలపై ఆయనకు అవగాహన లేదని విమర్శించారు. 'కౌల్ అండ్ షగ్దర్' రాసిన పార్లమెంటరీ ప్రాక్టీస్ బుక్ అమెజాన్‌లో 3,250 రూపాయలకు దొరుకుతుందని, ఆ పుస్తకాన్ని ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా జగన్ కి పంపిస్తే అది చదువుకుని హోదా గురించి అడగటం మానేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెడుతూ 'మార్నింగ్ షో, మ్యాట్నీ షో'లలాగా మాట్లాడుతున్నారని, 10% సీట్లు లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. గేట్ నెంబర్ 4 నుంచి రావడం అవమానంగా భావిస్తే, మాజీ ముఖ్యమంత్రిగా కనీసం గేట్ నెంబర్ 2 నుంచి అయినా వచ్చే అవకాశం కల్పిస్తే జగన్ సభకు వస్తారేమో పరిశీలించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.


