రోహిత్ మండవ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదుగురికి కృత్రిమ కాళ్ల అమరిక
తోటపల్లి (అగిరిపల్లి): యవ్వన ప్రాయంలోనే తనువు చాలించిన రోహిత్ మండవ (అమెరికా) జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన 'రోహిత్ మండవ మెమోరియల్ ట్రస్ట్' ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని తోటపల్లిలో ఉన్న హీల్ పారడైజ్ బాలల ఆశ్రమంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మండవ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. రోహిత్ జ్ఞాపకార్థం సమాజానికి తోడ్పడాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ ద్వారా వివిధ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆశ్రమంలోని వెయ్యి మంది బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, శారీరక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న ఐదుగురికి కృత్రిమ కాళ్లను అందజేశామన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాలకు చెందిన దివ్యాంగులకు ఈ కృత్రిమ కాళ్లను అమర్చినట్లు పేర్కొన్నారు.
హీల్ సి.ఈ.ఓ. కూరపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ సంస్థలు, దాతల సహకారంతో హీల్ పారడైజ్ ద్వారా ఇప్పటి వరకు 872 మందికి కృత్రిమ కాళ్లను ఉచితంగా అందజేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో దాతలు మండవ అమ్మాజీ, మండవ లక్ష్మి ప్రసాద్, త్రిపురనేని శ్రీనివాస్, చేకూరి నాగలక్ష్మి పాల్గొన్నారు. అలాగే హీల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, సీనియర్ టెక్నీషియన్ కె. చిన్నా, కృత్రిమ అవయవ కేంద్ర సిబ్బంది మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


