పోలవరం నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
పోలవరం నియోజకవర్గంలోని పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా ప్రోత్సహించేందుకు సీబీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరీక్ష కిట్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం అందజేశారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2,555 మంది పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు పరీక్ష కిట్లను అందజేశారు. అనంతరం నూతిరామన్నపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేరుగా విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేసి వారికి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆశీర్వదించారు.
విద్యార్థులకు అందజేసిన పరీక్ష కిట్లలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్‌లు, షార్పెనర్, జామెంట్రీ బాక్స్ వంటి పరీక్షలకు అవసరమైన అన్ని సామగ్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిట్లు విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పదవ తరగతి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడం ద్వారా తమ కుటుంబానికి, సమాజానికి గౌరవం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి విద్యార్థి మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కూడా విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం అందరూ కలిసి వారికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పోలవరం నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


