మహారాష్ట్రలోని చారిత్రాత్మక కోపేశ్వర దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు సందర్శించారు. 12వ శతాబ్దపు అద్భుత శిల్పకళా వైభవానికి నిలయమైన ఈ క్షేత్రంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది తీరాన వెలసిన ఈ ప్రాచీన ఆలయ విశిష్టతను, అక్కడి వాస్తు శిల్ప చాతుర్యాన్ని వారు ఈ సందర్భంగా ఆసక్తిగా తిలకించారు. శివుడు కోపంతో ఉన్న సమయంలో ఇక్కడ వెలిశాడని పురాణ గాథలు చెబుతుండటంతో ఈ ఆలయానికి కోపేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది. ఈ దేవాలయంలోని స్వర్గ మండపం, సభామండపం మరియు గర్భాలయంలోని శిల్పకళా నైపుణ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పైకప్పు లేని స్వర్గ మండపంలోని 48 స్తంభాలపై చెక్కిన సూక్ష్మ శిల్పాలు నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగిన వెంకట్రావు దంపతులు, ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే ఈ కట్టడాల పరిరక్షణ ఆవశ్యకతను తెలుసుకున్నారు.


