ప్రమాదవశాత్తు పడి ముగ్గురు విద్యార్థుల మరణించడం కలిచివేసింది
గన్నవరం,( మంజీర గళం) ప్రతినిధి,
కృష్ణా జిల్లా ,గన్నవరం
అక్రమ తవ్వకాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గడిచిన 21 మాసాలుగా నియోజకవర్గంలో పరిశ్రమలు, సిడాక్ (C-DAC), కృష్ణా యూనివర్సిటీ వంటివి తీసుకురావడానికి ఎంతో కష్టపడి పని చేశానని, కొన్ని విషయాలు ఆనందాన్నిచ్చినా మరికొన్ని బాధ కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. శాసనసభలో విప్‌గా ఉన్నందున క్వశ్చన్ అవర్‌లో మాట్లాడే అవకాశం ఉండదని, అందుకే జీరో అవర్‌లో గన్నవరం సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అయితే, గడిచిన మూడు రోజులుగా ఎమ్మెల్యేగా తాను చాలా బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన చిక్కవరం గ్రామంలోని సుందరయ్య చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని వెంకట్రావు తెలిపారు. మృతుల్లో 8వ తరగతి చదువుతున్న దుప్పుల వినయ్‌కుమార్ (14), 10వ తరగతి విద్యార్థి బిళ్ళ మోహన్ సాయి (15), మరియు ముచ్చ వెంకట జోసెఫ్ (15) ఉన్నారని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి 10:30 గంటలకు రెండు బాడీలు దొరికితే, మూడో బాడీ 12 గంటల తర్వాత దొరికిందని.. విప్‌గా సభలో బాధ్యతలు ఉండటం వల్ల ఆ రోజున పరామర్శకు వెళ్లలేకపోయానని అన్నారు. చనిపోయిన పిల్లలంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సెంటరింగ్, రాడ్ బెండింగ్, పెయింటింగ్ పనులు చేసుకునే వారి బిడ్డలని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమంగా చెరువులు, క్వారీలు తవ్వడం వల్లే గత 4-5 ఏళ్లలో 34 మందికి పైగా చనిపోయారని, అందులో 90% విద్యార్థులేనని ఆరోపించారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గతంలో సావారుగూడెంలో చనిపోయినప్పుడు కలెక్టర్‌తో మాట్లాడి డబ్బులు ఇప్పించానని, కానీ డబ్బుల వల్ల పోయిన ప్రాణం తిరిగిరాదని అన్నారు. ఈ 34 మంది మరణాలు గత పాలకుల శాపమని, వాళ్ల ఉసురు కచ్చితంగా తగులుతుందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడదామంటే మూడు రోజులుగా జీరో అవర్ లేదని, విప్‌గా ఉన్నందున కాలింగ్ అటెన్షన్ ఇచ్చే అవకాశం లేదని, క్వశ్చన్ అవర్‌లో ఇంప్లీడ్ అయ్యే సందర్భం రాలేదని అందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. బాపులపాడులో 53, గన్నవరంలో 28, ఉంగుటూరులో 3 చెరువుల చుట్టూ తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో మైనింగ్ మంత్రికి, జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చానని, బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా చెరువులు తవ్విన వారిపై మర్డర్ కేస్ బుక్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ గ్రామంలో చెరువు తవ్వడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలాలన్నారు. గత ఎంఆర్ఓ పాత్రపై విచారణ జరగాలని కోరారు. 30 నుంచి 150 అడుగుల లోతు వరకు అక్రమంగా మట్టి తవ్వేసి విద్యార్థులు చనిపోతుంటే తాను విట్నెస్‌గా ఉండదలచుకోలేదని తెలిపారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో చెరువు ఎంత లోతు తవ్వారో కొలవడం కష్టం కాదని,కానీ కొంత మంది అలసత్వం వహిస్తున్నారని.. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. గన్నవరానికి తనతో సహా 11 మంది ఎమ్మెల్యేలు పనిచేశారని, ఏ ఎమ్మెల్యే చేయని విధంగా గత ఎమ్మెల్యే కొండలను, గుట్టలను మాయం చేశారని విమర్శించారు. గ్రావెల్ అడ్డగోలుగా తవ్వేసి ఆ డబ్బుతో ఏం చేసుకుంటారని అక్రమ మైనింగ్ చేసిన వారిని ప్రశ్నించారు. అమరావతికి గ్రావెల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బిఎస్ఆర్ఎల్, ఎన్సిసి, మెగా, ఆర్విఆర్ వంటి కంపెనీలకు ఇచ్చిన 490 ఎకరాల్లో గ్రావెల్ లేదని, అదంతా ముందే అక్రమంగా తవ్వేశారని ఆరోపించారు. గన్నవరం దోపిడీకి గురైందని, అందుకే ఇక్కడికి డిఎంఎఫ్ ఫండ్స్ ఎక్కువగా ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున కూడా గన్నవరం వేదికగా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు 7 కోట్ల రూపాయల చెక్కు ప్రభుత్వం నుంచి డ్రా అయిందంటే మైనింగ్ మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అలాగే లక్ష్మీ ఇన్ఫ్రా కంపెనీ నిడమానూరు హైవే వేసేందుకు వాడిన పోలవరం మట్టి, విటిపిఎస్ బూడిద విషయంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరగాలని కోరారు. కొండపావులూరులో హౌస్ సైట్స్ పేరుతో 25-30 అడుగుల లోతు వరకు గ్రావెల్ మాయం చేశారని ఆరోపించారు. గుడివాడ, గన్నవరం, పామర్రు మాజీ ఎమ్మెల్యేల ఆస్తుల మీద ఎంక్వైరీ చేస్తే అక్రమాలు తెలుస్తాయని, అవసరమైతే తన ఆస్తుల మీద కూడా విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. కొండపావులూరులో 784 ఎకరాల మేర తవ్వకాలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టాలని మంత్రిని, కలెక్టర్‌ను కోరానని చెప్పారు. ఆ పసిపిల్లల ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నానని ఆ కుటుంబాలను వ్యక్తిగతంగా ఆదుకుంటానని చెప్పారు. రాబోయే కాలంలో ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అలానే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, చెరువులకు ఫెన్సింగ్ వేయాలని కోరారు. మైనింగ్ కంపెనీలు సక్రమంగా పని చేయాలి తప్ప ఎవరి ఉసురు తీయకూడదని యార్లగడ్డ వెంకట్రావు హితవు పలికారు.


