పదో తరగతి విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి.. గాడ్సన్ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ కోలేటి పాల్ రమేష్

పదో తరగతి  విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి.. గాడ్సన్ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ కోలేటి పాల్ రమేష్


 ఆగిరిపల్లి :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి, తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు చదువుకున్న విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకురావాలని గాడ్సన్ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ కోలేటి పాల్ రమేష్ పిలుపునిచ్చారు.

మండల కేంద్రమైన ఆగిరిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఎడ్వర్డ్స్ ఎల్మో విల్సన్ జ్ఞాపకార్ధం రూత్ విల్సన్ అందించిన సహకారంతో సుమారు 150 మంది విద్యార్థులకు ఈ సామాగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా పాల్ రమేష్ మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా తమ సంస్థ ద్వారా పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా, ధైర్యంగా పరీక్షలు రాయాలని, కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఐ. పుష్పలత మాట్లాడుతూ.. అనాథ బాలలకు, వృద్ధులకు, విధవరాండ్రకు సేవ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు గాడ్సన్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయ బృందం, సంస్థ ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.