పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల బాసట... మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ కనెక్షన్ వితరణ


ఆగిరిపల్లి:
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1995-96 విద్యా సంవత్సర పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సజావుగా సాగేందుకు, వంట అవసరాల నిమిత్తం భారీ విరాళాన్ని అందజేశారు.
శుక్రవారం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో, మెఘా గ్యాస్ కనెక్షన్ డిపాజిట్ కొరకు రూ. 20,000 మరియు నూతన స్టవ్‌ల కొనుగోలు నిమిత్తం రూ. 5,000 మొత్తాన్ని పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎస్.కె. ఇలియాస్, వడ్డీ కాసులు చొరవ తీసుకోగా, మెఘా గ్యాస్ ప్రతినిధులు ఎస్.వి.ఎస్. ప్రసాద్, సిహెచ్. ఫణి కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ హెచ్‌ఎం బి.వి.ఎస్. లక్ష్మి, ఉపాధ్యాయులు సిహెచ్. నాగరాజు, ఎస్.కె. సలీం మరియు ఎక్స్ అఫీషియో సభ్యులు జూలూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు దాతలు పాఠశాల బలోపేతానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.