విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో సత్ఫలితాలు సాధించాలి: మాజీ సీవీసీ కె.వి. చౌదరి
విద్యార్థులు క్రమశిక్షణను అలవరచుకుని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పూర్వపు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ మరియు మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి. చౌదరి పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న వనరులను, వసతులను సద్వినియోగం చేసుకున్నప్పుడే జీవితంలో కృతార్థులవుతారని ఆయన పేర్కొన్నారు.
హీల్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా చుండూరు కోటయ్య-రామ శేషమ్మ ఫౌండేషన్, నిహారిక ఫౌండేషన్, మాచినేని గ్రాండియస్ మరియు పలువురు దాతల ఆర్థిక సహకారంతో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 25 మంది వికలాంగులకు కృత్రిమ కాళ్ళను అందజేశారు.
అనంతరం వివిధ సబ్జెక్టుల్లో మరియు క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో హీల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్, దాతలు వేగే వాసు, చుండూరు మధుసూధనరావు, కాకర్ల నిరుపమ, గౌరా జ్యోతి, హీల్ డైరెక్టర్లు పిన్నమనేని ధనప్రకాష్, మలినేని రంగప్రసాద్, యలమంచిలి బాలాజీ, సీఈఓ కూరపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


