అస్తవ్యస్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు

 అస్తవ్యస్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు


అవకతవకలు జరిగితే సహించేది లేదు 

విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ విజయకృష్ణ వంటిపల్లి 

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలం సీతానగరం ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో శుక్రవారం విజిలెన్స్ కమిటీ తనిఖీ నిర్వహించారు. కమిటీ సభ్యుడు డా. వంటిపల్లి విజయకృష్ణ తనిఖీలో పాల్గొని విద్యార్ధుల హాజరు, నేటి మెనూ వివరాలు, ఎంతమంది విద్యార్థులు భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. సరుకు నిల్వ వివరాలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. వంటశాలలో వంటకాల తయారీ ని పరిశీలించారు. విద్యార్ధులతో సంభాషించి మెనూ అమలు, వంటకాల రుచి, సిబ్బంది తీరు మధ్యాహ్న భోజన పధకం ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా వంటి తదితర విషయాలు ఆరా తీశారు. రికార్డు ప్రకారం సరుకు నిల్వ లేకపోవడం పరిశీలించి ప్రధానోపాధ్యాయుని వివరణ కోరగా సరయిన సమాధానం లేకపోవడంతో విజయకృష్ణ ఒకింత అసహనానికి గురయ్యారు. రికార్డులో ఎంట్రీ తప్పుగా పడిందని, సమయానికి సరుకు రాక మరొకరి దగ్గర కొంత అప్పుగా తీసుకువచ్చామని ప్రధానోపాధ్యాయుడు రకరకాల సాకులు చెప్పడంతో విజయకృష్ణ వంట సిబ్బందిని ఒక్కొక్కరిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, 15 గుడ్లు మాత్రమే అంగన్వాడీ కేంద్రంలో తీసుకున్నట్లు సరుకు రాగానే తిరిగి వాళ్లకి ఇచ్చేసినట్లు వారు తెలపడం కొసమెరుపు. సంబంధిత వ్యక్తులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని విజయకృష్ణ తెలిపారు