రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి కూటమి ప్రభుత్వ విప్ యార్లగడ్డ
అమరావతి,
అసెంబ్లీలో జరిగిన 2026-27 బడ్జెట్ చర్చలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రసంగం చేశారు. ఈ బడ్జెట్ కేవలం ఆదాయ ఖర్చుల లెక్కల పత్రం మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేసే ప్రభుత్వ సంకల్పానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధి అంటే ప్రజలకు లభించే అవకాశాల విస్తరణేనన్న నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మాటలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3,32,205 కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్‌ను ప్రతిపాదించిందని, అందులో పెట్టుబడి వ్యయం కోసం రూ.53,915 కోట్లు కేటాయించడం గొప్ప విషయమని కొనియాడారు. గత బడ్జెక్ట్ తో పోలిస్తే పెట్టుబడి వ్యయం 33% పెరిగిందని, ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి సంపదను సృష్టించే పెట్టుబడి అని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతలను విస్మరించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మౌలిక సదుపాయాలైన రహదారులు, ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు 6,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తూ, ఇది వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఎంతగానో ఊతమిస్తుందని వెంకట్రావు పేర్కొన్నారు. అలాగే అమరావతిని కేవలం పరిపాలన కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. సంపద సృష్టి కోసం 100 కోట్ల సీడ్ కార్పస్‌తో 'ఏపీ వెల్త్ ఫండ్' ఏర్పాటు చేయడం ఒక విప్లవాత్మక నిర్ణయమని ఆయన అభివర్ణించారు. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు మరియు విద్యా రంగానికి దాదాపు 35,000 కోట్లు, బడ్జెట్‌లో 10% కేటాయించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి ఒక కీలక సూచన చేశారు. తన నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. "అధికారం ఆశ ఉన్నవారికి ఇస్తే దోచుకుంటారు, అదే ఆశయం ఉన్నవారికి ఇస్తే అభివృద్ధి చేస్తారు" అని 1962లోనే సుందరయ్య ఈ సభలో చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యాలని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం ఆశతో రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఒక గొప్ప ఆశయంతో ఈ బడ్జెట్‌ను రూపొందించిందని యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు.


