రైతుల అంగీకారంతోనే నేవీ డిపో ప్రాజెక్టు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ‎

 రైతుల అంగీకారంతోనే నేవీ డిపో ప్రాజెక్టు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

. 90 శాతం మంది ప్రజలు నేవీ డిపోకు అనుకూలంగానే ఉన్నారు.

‎.. కొద్ది మంది స్వార్ధపరుల దుష్ప్రచారాలు నమ్మవద్దు.

‎.. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం.

‎.. జిల్లాలో రోడ్లు, స్మశాన వాటికలకు నిధులు.

‎.. మద్ది ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

నేవీ ఆయుధ డిపోకు భూములు ఇచ్చేందుకు 90 శాతం మంది ప్రజలు అనుకూలంగానే ఉన్నరన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెంలో వెలసిన మద్ది ఆంజనేయస్వామి క్షేత్రాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎంపీ మాట్లాడారు.

‎     వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు. కొయ్యలగూడెం ప్రాంతంలో నేవీ డిపో కు భూములు సేకరించే ముందు తాను అక్కడి గ్రామాల రైతులందరినీ పిలిచి మాట్లాడుతున్నానని అందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారన్నారు. దాదాపు 900 పైగా ఎకరాలకు సంబంధించిన రైతులు తమ అంగీకార పత్రాలను కూడా ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. రైతులందరినీ ఒప్పించి ముందుకు వెళ్తామని ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు గానీ, ప్రభుత్వానికి గాని లేదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాలు  పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయని ఎంపీ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్న  ఎంపీ, నేవీ డిపో వల్ల ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా రెండు వేలమందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి పరోక్షంగా పదివేల నుంచి 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు. నేవీ డిపోకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ భూములు లేని వారు కొంతమంది ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళని తీసుకువచ్చి ఆందోళనలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.  ఇది ఆయుధం డిపో మాత్రమేనని ఆయుధ కర్మాగారం కాదని ఇక్కడ ఆయుధాలు తయారు చేయరనే విషయాన్ని గమనించాలని ఎంపి కోరారు. కేవలం నలుగురైదుగురు స్వార్థపర వ్యక్తులు ప్రజల్ని అపోహలకు భయాందోళనలకు గురి చేస్తున్నారు తప్ప మిగిలిన 90 శాతం మంది రైతులు ప్రజలు స్వాగతిస్తున్నారని అందరిని ఒప్పించి ముందుకు వెళ్తామని ఎంపీ తెలియజేశారు.

‎     చింతలపూడి లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ఆ పనులు దిగ్విజయంగా సాగాలని మద్ది ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు ఎంపీ వెల్లడించారు. ఎన్జీటీ కేసులు సహా అన్ని అవరోధాలను అధిగమించి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కృషి చేస్తున్నారని, దీనిపై ఇటీవలే ముఖ్యమంత్రి  ప్రకటన కూడా చేశారని ఎంపీ గుర్తు చేశారు. నూజివీడు, చింతలపూడి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరమైన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అదేవిధంగా చింతలపూడి - ఏలూరు రోడ్డు పనులు కూడా దాదాపు పూర్తికావచ్చాయని, మిగిలి ఉన్న నాలుగు కిలోమీటర్ల పనులు కూడా కొద్ది రోజుల్లో పూర్తి అవుతాయని ఎంపీ చెప్పారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నామని, దీనిపై ఎంపవర్మెంట్ కమిటీ (CEC) తో కూడా తాను మాట్లాడినట్టు ఎంపీ చెప్పారు.  ఏలూరు జిల్లాలో రోడ్లు, స్మశాన వాటికల పనులకు నిధులు మంజూరు చేశామని, కొన్నిచోట్ల కల్వర్టులు, రోడ్డు బ్రిడ్జిలు పనులు కూడా చేయాల్సిందని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కోకో హబ్ ఏర్పాటు చేయటం ద్వారా కోకో రైతుల సమస్యలు కూడా తీరిపోతాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానన్నారు. 

‎     అంతకుముందు 12 గంటల సమయంలో  జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం లో వెలసిన మద్ది ఆంజనేయస్వామి క్షేత్రానికి వచ్చిన  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఆలయ ఏసి చందన, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పండితులు ఎంపీకి వేద ఆశీర్వాదం అందించి, స్వామి వారి శేష వస్త్రాలు, జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. ఎంపీ పర్యటనలో జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు,రాజాన సత్యనారాయణ(పండు) పార్టీ నాయకులు కోనేటి చంటి, కుక్కల మాధవరావు గొల్లమందల శ్రీనివాసరావు,ఇతర నేతలు పాల్గొన్నారు.