చట్టాల పట్ల విద్యార్థులకు అవగాహన ఉండాలి
విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ విజయకృష్ణ వంటిపల్లి
బాలికల ఉన్నత పాఠశాలలో కన్జ్యూమర్ క్లబ్ ఏర్పాటు
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని, ఆ చట్టాల ద్వారా మనకు కల్పించబడిన హక్కుల గురించి తెలుసుకోవాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ అన్నారు. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వినియోగదారుల రక్షణ చట్టం అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా వినియోగదారులకు కల్పించబడిన హక్కులు, సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడిన వినియోగదారుల కమిషన్లు, వినియోగదారులు తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి తదితర అంశాలు విజయకృష్ణ విద్యార్థులకు వివరించారు. అనంతరం కన్జ్యూమర్ క్లబ్ ఏర్పాటుకు ఆసక్తిగల విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది ఎంపిక చేసి విజయకృష్ణ సమక్షంలో కన్జ్యూమర్ క్లబ్ ఏర్పాటు చేశారు. గైడ్ టీచర్ ప్రమీల రాణి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గ్లోరీ, ఎస్ఎంసి చైర్మన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


