యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజల స్వరం – శాంతి కోరుతున్న ప్రపంచం

 యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజల స్వరం – శాంతి కోరుతున్న ప్రపంచం



ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, మూడు దేశాల నేతలు యుద్ధంపై కఠిన వైఖరి తీసుకుంటుండగా, ఆయా దేశాల ప్రజలు మాత్రం శాంతిని కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య తలపడుతున్న పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్‌ ప్రాంతంలో పెరుగుతున్న ఈ ఘర్షణ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే రాజకీయ నాయకులు యుద్ధానికి సిద్ధమవుతున్నా, సామాన్య ప్రజలు మాత్రం యుద్ధానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ దేశాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. “యుద్ధం వద్దు – శాంతి కావాలి” అంటూ నినాదాలు చేస్తున్నారు. యుద్ధం వల్ల సాధారణ ప్రజల జీవితం దెబ్బతింటుందని, ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా ఇరాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. యుద్ధానికి దూరంగా ఉండాలని, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి చెందిన విప్లవ గార్డ్స్‌ (IRGC) ఈ నిరసనలను కఠినంగా అణచివేస్తున్నాయి. పాలకులపై తిరుగుబాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గత జనవరిలో ఇరాన్‌లో జరిగిన నిరసనల సమయంలో భద్రతా దళాలు వేలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసి, నిరసనలను బలవంతంగా అణిచివేశాయి. అయినప్పటికీ ప్రజల్లో అసంతృప్తి తగ్గలేదు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రపంచ నాయకులు ప్రజల భావాలను గౌరవించి, శాంతి మార్గం వైపు అడుగులు వేయాలని అంతర్జాతీయ వర్గాలు సూచిస్తున్నాయి.