డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన కంటెంట్ మరియు వాడకం నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలను చేపట్టినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. సోషల్ మీడియా వాడకం పిల్లలపై, వారి మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం, 2000, పిల్లల డేటా రక్షణ (DPDP చట్టం, 2023), India AI మిషన్ కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన కంటెంట్ పిల్లలను రక్షించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
సోషల్ మీడియాలో హానికర కంటెంట్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ.. చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ ను పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నిరోధించాలని ఆదేశించినట్లు తెలిపారు. సమాచార భద్రతలో మానవ వనరుల వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ భద్రత అంశాలపై సాధారణ అవగాహనను కల్పించడానికి ISEA పై MeitY ఒక ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 4,309 అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయనీ, వీటిలో పాఠశాల/కళాశాలలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్థలు, ప్రభుత్వ సిబ్బంది మరియు సాధారణ ప్రజలు సహా 9.63 లక్షల మంది పాల్గొన్నారని, పాఠశాల పిల్లలు మరియు విద్యార్థుల కోసం 1,186 అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయని కేంద్ర మంత్రి వివరించారు.


