ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకోసం గత 5 ఏళ్లలో 104.29 కోట్ల నిధులు విడుదల చేయగా, 94.23 కోట్లు విలువైన పనులు ఇప్పటికే పూర్తి చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు . ఏలూరు సహా ఏపీ లోని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 2025-26 ఏడాదికి గాను 30.98 కోట్లు కేటాయించగా, 20.92 కోట్లు ఇప్పటికే వినియోగించినట్లు చెప్పిన కేంద్ర మంత్రి, మరో 10.06 కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు వివరించారు. జడ్జిల నివాస గృహాలు, కోర్టు భవనాల నిర్మాణం, ఇతర సదుపాయాల కోసం ఈ నిధులు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 1993-94 నుండి న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పథకం (CSS)ను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో ఖాళీలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో మొత్తం 84 జడ్జిల, న్యాయాధికారుల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఖాళీలు ఉన్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. కోర్టు హాళ్లు, న్యాయ అధికారుల నివాస యూనిట్లు, న్యాయవాదుల హాళ్లు, టాయిలెట్ కాంప్లెక్స్‌లు మరియు డిజిటల్ కంప్యూటర్ గదులు.
ఏలూరు జిల్లా కైకలూరు సహా 33 జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులు పూర్తికాగా, మరో 12 కోర్టులలో పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.


